హామీ సంతకం చేస్తున్నారా? కాస్త హామీ సంతకం చేస్తారా?ఈ ప్రశ్న మీ మిత్రుడో.. దగ్గరి బంధువో అడిగితే మీరేం చేస్తారు?మీ మధ్య ఉన్న స్నేహం, బంధుత్వం లేదా మొహమాటంతో కాదనలేకో అంగీకరిస్తారు కదూ! గృహ, వాహన రుణాలు, వ్యాపారానికి..పెద్ద మొత్తంలో అప్పు తీసుకునే వారి విషయంలో కొన్నిసార్లు బ్యాంకులు, రుణ సంస్థలు, ఎవరినైనా హామీగా చూపించాలని కోరుతుంటాయి. నమ్మకమైన స్నేహితుడు, బంధువుల కోసం హామీగా ఉండటంలో ఇబ్బంది లేదు. అయితే, హామీ ఇస్తున్నామంటే మనకూ కొన్ని బాధ్యతలు ఉంటాయన్న సంగతి గుర్తుంచుకోవాలి. అందుకే, 'సరే'..అనే ముందు మీపై ఎలాంటి ప్రభావం..ఎంత వరకు..ఉంటుంతో తెలుసుకోవాలి.
ఏ విషయంలోనైనా మధ్యవర్తిగా ఉన్నామంటే అర్థం.. ఇరువైపులా ఏ ఇబ్బంది వచ్చినా పరిష్కరిస్తామని. రుణగ్రహీత, సమయానికి బాకీ చెల్లించేలా చూసే బాధ్యత హామీదారుడిదే. ఒకవేళ అతను రుణాన్ని చెల్లించని సందర్భంలో హామీగా ఉన్న వ్యక్తి ఆ మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది.
బ్యాంకులు రుణ గ్రహీత తీసుకుంటున్న అప్పుని.. తిరిగి తీర్చగల సామర్థ్యం ఉన్న వ్యక్తులనే హామీదారునిగా అంగీకరిస్తాయి. ఇంకా చెప్పాలంటే, హామీదారుడు కూడా ఒకరకంగా రుణ గ్రహీతే. ఎందుకంటే హామీ దారు అప్పు తీసుకోకపోయినా, ఈఎమ్ఐ లు చెల్లించకపోయినా రుణ గ్రహీత రుణం చెల్లించలేని పక్షంలో..ఆ మొత్తాన్ని చెల్లించాల్సిన బాధ్యత హామీదారునిపై పడుతుంది. అందువల్ల బ్యాంకులు, రుణం ఇచ్చే సంస్థలు హామీ దారుని ఆస్తులు, క్రెడిట్ స్కోరు వంటివి పరిశీలిస్తాయి. ఇందుకోసం హామీదారు కూడా బ్యాంకుకు కేవైసి, ఆదాయం డాక్యుమెంట్లు వంటివి సమర్పించాల్సి ఉంటుంది.
రుణగ్రహీతకు అనుకోనిదేదైనా జరిగినా..బ్యాంకులు హామీగా ఉన్న వ్యక్తినే సంప్రదిస్తాయి. అప్పుడు కూడా బాకీ తీర్చే ఏర్పాటు చేయాల్సిన చట్టబద్ధమైన బాధ్యత హామీదారుడిదే. ఇది రుణ ఒప్పంద పత్రం మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి, హామీ ఇచ్చేటప్పుడు నిబంధనలు క్షుణ్ణంగా చదివి..అవి ఏం చెబుతున్నాయో తెలుసుకోవాలి.
ఇతర వ్యక్తుల రుణాలనికి మీరు హామీ ఇచ్చినట్లయితే ఆ సంగతి 'సిబిల్' నివేదికలో కూడా నమోదు అవుతుంది. రుణాలను తెలియపరిచే చోట..మీరు హామీగా ఉన్న రుణ మొత్తాన్ని పేర్కొంటారు. రుణం తీసుకున్న వ్యక్తి నెలవారీగా ఆ రుణాన్ని ఎలా చెల్లిస్తున్నాడు అనే అంశం ఆధారంగా మీ రుణ చరిత్ర ప్రభావితం అవుతుంది.
ఒకవేళ రుణగ్రహీత వాయిదాల చెల్లింపులు సరిగ్గా చేయకపోయినా, మొత్తంగా ఆపేసినా మీ క్రెడిట్ స్కోరు తగ్గే అవకాశం ఉంటుంది. అందువల్ల రుణ పత్రంపై హామీదారుగా సంతకం చేస్తే సరిపోదు. రుణం తీసుకున్న వ్యక్తి సరైన సమయానికి వాయిదాలు చెల్లిస్తున్నాడా..లేదా..అనేదీ ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండాలి. ఒకవేళ అతడు చెల్లించకపోతే..మీరు ఏం చేయాలి? మీ బాధ్యత ఏమిటో ముందే తెలుసుకోండి.
ఏం చేయాలంటే:
- రుణ గ్రహీత ప్రాణ స్నేహితుడు, దగ్గరి బంధువు అయినప్పుడు హామీదారుగా సంతకం చేయాల్సిన పరిస్థితులు రావొచ్చు. అలాంటి సందర్భం ఎదురైతే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.
- ముందుగా రుణ గ్రహీత చెల్లింపుల సామర్థ్యం ఎంత?ఆర్థిక విషయాలలో అతను/ఆమె ఎంత వరకు క్రమశిక్షణగా ఉంటారు? ఇందులో మీ రిస్క్ ఎంత?అనే విషయాలలో మీకు ఖచ్చితమైన అవగాహన ఉండాలి.
- రుణ చెల్లింపులపై నిఘా ఉంచాలి. నెలవారిగా సమయానికి చెల్లింపులు చేస్తున్నారా లేదా అని మీ క్రెడిట్ నివేదికలు చూస్తే తెలుస్తుంది. ఎందుకంటే, హామీ ఇవ్వబడిన మొత్తం కూడా క్రెడిట్ రిపోర్ట్‌లో కనిపిస్తుంది.
- హామీ సంతకం చేసే కంటే ముందే బ్యాంకు, రుణ సంస్థ విధించే నిబంధనలు తెలుసుకోండి.
- ఎట్టి పరిస్థితుల్లోనూ ఖాళీ లేదా సగం నింపిన పత్రాల మీద సంతకం చేయకండి. అవసరమైతే న్యాయ సలహాలు తీసుకోండి.
- ఏదైనా నిబంధన విషయంలో మీకు భవిష్యత్తులో ఇబ్బంది కావచ్చు అనిపించినా, దానిపై మీకు అభ్యంతరాలు ఉన్నా సంతకం చేయవద్దు.
- మీ ఫొటో, గుర్తింపు వివరాలను నేరుగా రుణ సంస్థకు, అధీకృత వ్యక్తికి మాత్రమే అందించండి. రుణం తీసుకోబోయే వ్యక్తికి ఇవ్వడం అంత క్షేమం కాదు.
- హామీ ఇవ్వడం అంటే అదనపు బాధ్యతలను తీసుకోవడమే. అందుకే, ముందుగా మీ రుణ చరిత్ర, క్రెడిట్ స్కోరు తెలుసుకోవడం ఉత్తమం.
Comments
Post a Comment